తిరుమల దృశ్యకావ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమల దృశ్యకావ్యం, రచయిత: ఆలూరు రాఘవశర్మ, పాండు పబ్లికేషన్స్, తిరుపతి,2022. తిరుపతికి పశ్చిమోత్తరాన తలకోననుంచి తూర్పున, ఏర్పేడు వరకు విస్తరించిన శేషాచలం కొండలున్నాయి. శేషాచలం, తిరుపతి, తిరుమల కొండలమీద, చిత్తూరు, కడప మధ్య ఈ కొండలమీద జలపాతాలు, దర్శనీయ స్థలాలను చూచి, అ అందాలను అనుభవించి, శర్మగారు "తిరుమల దృశ్యకావ్యం"గా రచించారు. ఆయన పాతికేళ్లుగా చేసిన సాహస యాత్రల్లో, కొండలపైకి అధిరోహించి, అక్కడ ఏర్పడిన జలపాతాలను, ఆ జలపాతాలు కిందికి దుమికేచోట ఏర్పడిన గుండాలను(సరస్సులు, నీటిమడుగులు)దర్శించి, ఆ గుండాలలో దూకి ఈదులాడడం వంటి గొప్ప సరదాలను, అనుభవాలను మనందరితో పంచుకోను ఈ రచన చేశారు.

ట్రెకింగ్ ఒక మోజు, మనసుకు ఇష్టమైన క్రీడ, సాహస ప్రవృత్తి ఉన్నవారే ఇందుకు పూనుకొంటారు. శరీరదారుఢ్యం, మానసికకగా ప్రమాదాలను ఎదుర్కొనేశక్తి, ఒక సమూహంలో, బృందంలో కలిసి పనిచేయగలవారే ఇందుకు అర్హులు.

శర్మగారు శేషాచలం కొండల్లోని ఎన్నెన్నో శిఖరాలనెక్కి, అతి కష్టమైన మార్గాల్లో నడిచి, ఆ అందాలను, ఆనందాలనూ ఈ దృశ్యకావ్యంలో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

వారి కవిహృదయం ఆ కొండలు, కొండ దారులు, అడవులు, జలపాతాలు, గుండాలు, ఆ దారుల్లో తారసపడే పిట్టలు, చెట్లుపుట్టలు, మనుషులు, ఒకటేమిటి, ప్రతి దాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు. 'టోక్యో' అనే మారుపేరుతో పిలవబడే యువకుని మార్గదర్శకత్వంలో ఆ కొండలన్నీ తిరిగారు. తిరుమల కొండల్లో 'టోక్యో' తిరుగని కొండ, కొనే లేదట!

రామకృష్ణ తీర్థంలో గిరిశిఖరాలు ఆ నీటి ప్రవాహంలో ప్రతిబింబిస్తూంటాయి. తిరుమల గిరుల్లో కనువిందుచేసే రమ్యమైనది రామకృష్ణ తీర్థం! తీర్థాన్ని దర్శించి ఆ రాత్రి వెన్నెట్లో కొండల మధ్య నిదురించి, తెల్లవారి సహ యాత్రికులతో తిరుగు ప్రయాణమవుతారు.

లక్షల సంవత్సరాల క్రితం శేషాచలం కొండల్లో ఒక భౌగోళిక మహా ప్రళయం సంభవించి, దాదాపు కిలోమీటరు చీలిన ఆ రాతికొండలో సుందరమైన దృశ్యాలు ఆవిష్కరించబడ్డాయి. మార్చ్, ఏప్రిల్ మాసాల్లో వచ్చే పౌర్ణమినాడు తుంబురుతీర్థ ఉత్సవం జరుగుతుంది. ఆ దారికిరువైపులా కరక్కాయ,ఈత,అడవి గోగులు, కరివేపాకు, యెర్రచందనం ఎన్నెన్నో రకాల అడవి చెట్లు కనిపిస్తాయి. అడవి మల్లెల గుబాళింపు. రెల్లు పొదల మధ్య కాలినడక దారి. దారిలో చలువ బండలొస్తాయి. తీర్థానికి వచ్చినజనం పౌర్ణిమనాడు ఈ తీర్థం వద్ద బండలమీద నిద్రించి, తెల్లవారి సూర్యోదయానికి ముందే ఈ తీర్థంలో స్నానం చేస్తారు. ముందుకు సాగితే తాంత్రిక లోయలకు వెళ్లే దారి వస్తుంది. దారిలో అక్కడక్కడా చెట్లపైనుంచి పక్షులు శబ్దాలు చేస్తుంటాయి. మనుషుల అలికిడికి భయపడి పునుగు పిట్టలు, జెముడు కాకులు ఎగిరిపోతాయి. తీతువు అరుస్తూ మనుషులోస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది.

ఈ ప్రాంతంలో చిరుతల సచారం ఉంది, వాటి నివాసాలను మనం ఆక్రమిస్తూ మన ప్రాంతంలోకి చిరుతలొచ్చాయని గగ్గోలు పెడతాం. మనం కూడా వాటి దృష్టిలో దురాక్రమణ దారులమే!

వెంగమాంబ గుహలో ఒక దిగంబర స్వామి ప్రకృతి ఇచ్చిన ఆహరం తింటూ తిరుగుతూ వంటరిగా ఉండేవాడు. అతని వద్ద డబ్బున్నదని ఆ దురాశతో ధూర్తులు కొందరు అతన్ని హత్యచేసి తనదగ్గర ఉన్న చిల్లర డబ్బులు ఎత్తుకుపోయారు.

ఈకొండలలో ఎక్కడ చూచిన ఎర్రచందనం చెట్లు, కొండంతా ఈ చెట్లే! లోయలో రాళ్లను ఎక్కుతూ దిగుతూ ఉంటే, ముందుకు సాగేకొలదీ ఎటుచూసినా ఎన్నెన్నో ప్రకృతి అందాలు. సూర్యుడు నడినెత్తికొస్తే తప్ప ఆ అడవి దారుల్లో కన్పించడట.

తాంత్రిక లోయ,ఇతర ట్రెక్కింగ్ మార్గాలు 'టోక్యో' అనే మారుపేరున్న యువకుడికి కరతలామలకమట!

శర్మగారి కవిహృదయం ప్రకృతి అందాలను అద్భుతంగా ఈ పుస్తకంలో పట్టుకొంది. ప్రతివాగు, వంకల వర్ణనలలో అది తొంగి చూస్తుంది. వివిధ వన్యమృగాలు, దుప్పులు, జింకలు, చిరుతలు, ఏనుగులు కూడా చీకటి పడితేచాలు నీటికోసం ఆ కొండలమీద నిర్మించిన ప్రాజెక్టుల వద్దకు వస్తాయి.

సన్నటి ఇరుకు దారుల్లో నడక, కొండగుప్పెట్లో ఉన్నట్లున్న శేషతీర్థం చేరుకోడం శ్రమతో కూడిన వ్వవహారం. అటవీశాఖ ఆ అడవిలో నాటించిన సరుగుడు చెట్లు రాల్చిన ఆకుల వల్ల అగ్నిప్రమాదాలు సంభవిచవచ్చునట. మంటలు ఒక ప్రాంతంనుంచి మారో ప్రాంతానికి వ్యాపించకుండా ఆ కొండల్లో మధ్య మధ్య సరిహద్దుగా రాళ్లతో నిర్మించిన కుడ్యాలు మంటల వ్యాప్తిని అడ్డుకోలేక పోవచ్చని అంటారు. ఆ అడవవుల్లో బిక్కిపళ్ళు, దారంతా ఈతచెట్లు రాల్చిన పళ్లకోసం వచ్చే ఎలుగుబంట్లు, నీటిజాడే కనిపించని ఒంటరి దారులు, ఎన్నెనో వర్ణనలు. నిశ్శబ్దంగా నిదురిస్తున్న లోయలమధ్య గలగల పారే సెలయేళ్ళ సంగీతం, ఎత్తయిన వృక్షాలు నేలంతా పరచిన చిక్కని నీడలు, కొండలమీదనుంచి ఎత్తుప్రదేశం నుంచి చుస్తే వచ్చిన దారంతా అడవి తల్లి తలలో పాపిటలా కనిపిస్తుందట!

అడవుల్లో తిరిగే కూలీలు ఆ దారుల్లో కాసేపు బరువు దింపుకోడానికి, ఒకభుజం మీదినుంచి మరొక భుజంపైకి మార్చుకోడానికి, ఎత్తిన బండలు. (తమిళదేశంలో వీటిని సుమైత్తాంగి అనో మరేదో పేరుతొ వ్యవహరిస్తారు.)

కంటక పరీవృతమైన, కాళ్ళకు గుచ్చుకొని బాధించే గులకరాళ్ళ దారుల్లో ఉత్తకాళ్లతో నడుస్తూ దారిచూపే యానాదులు, అరణ్య వాసులు, ఎన్నెనో విషయాలు ఈ ట్రెక్కింగ్ అనుభవాల పుస్తకంలో ప్రస్తావనకు వస్తాయి.

మూలాలు

[మార్చు]

ఆలూరు రాఘవశర్మ యాత్రాచరిత్ర "తిరుమల దృశ్యకావ్యం", పాండు ప్రచురణ, తిరుపతి, 2022.