గోరన్ ఇవనీసెవిచ్ (జననం:1971 సెప్టెంబరు 13) క్రొయేషియన్ మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు, ప్రస్తుత కోచ్. అతను వైల్డ్ కార్డ్‌గా వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక ఆటగాడు. 2001 లో ప్రపంచ నంబరు 125 ర్యాంక్‌లో ఉన్నాడు. అతను గతంలో 1992, 1994, 1998 లో వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇవనీసెవిచ్ కెరీర్లో అత్యుత్తమ సింగిల్స్ ర్యాంకింగ్ ప్రపంచ నం.2 ను 1994 జూలైలో సాధించాడు. అతను తన శక్తివంతమైన ఎడమ చేతి సర్వ్‌లకు ప్రసిద్ది చెందాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వింబుల్డన్‌లో అత్యధిక ఏస్‌లు సాధించిన రికార్డు (1,377) అతని పేరిట ఉంది. 2019 లో రోజర్ ఫెదరర్ దానిని బద్దలు కొట్టాడు. ఇవానిసెవిచ్ 2013 సెప్టెంబరు నుండి 2016 జూలై వరకు మారిన్ సిలిచ్‌కు శిక్షణ ఇచ్చాడు. 2014 US ఓపెన్‌లో ఇప్పటి వరకు సిలిక్ అతని ఏకైక ప్రధాన టైటిల్ గెలవడంలో తోడ్పడ్డాడు. [2] అతను 2019 నుండి నోవాక్ జకోవిచ్‌కి కోచ్‌గా ఉన్నాడు. ఇవనీసెవిచ్ 2020లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు.[3]
గోరన్, గోరానా (స్కారిక్), స్రాన్ ఇవనీసెవిచ్ల కుమారుడు. [4] బాలుడిగా, అతను జెలెనా జెన్సిక్ వద్ద శిక్షణ పొందాడు. అతను 1988లో ప్రొఫెషనల్‌గా మారాడు. ఆ సంవత్సరమే రూడిగర్ హాస్‌తో కలిసి ఫ్రాంక్‌ఫర్ట్‌లో తన కెరీర్లో మొట్ట మొదటి డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సింగిల్స్ కెరీర్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినప్పటికీ, అతను డబుల్స్‌లో కూడా తొమ్మిది టైటిళ్లను గెలుచుకున్నాడు. కెరీర్లో అత్యధిక ర్యాంకింగ్ 20కి చేరుకున్నాడు.
1989లో, క్వాలిఫైయర్‌గా అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. 1990 టూర్లో ఇవనీసెవిచ్ మొదటిసారి తన ప్రభావాన్ని కనబరచాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో బోరిస్ బెకర్‌ను మొదటి రౌండ్లోనే పడగొట్టాడు; ఆ టోర్నమెంటులో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో పీటర్ కోర్డాతో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఆ సంవత్సరం వింబుల్డన్‌లో ఇవనీసెవిచ్, సెమీఫైనల్‌కు చేరుకుని, అక్కడ బెకర్ చేతిలో నాలుగు సెట్లలో ఓడిపోయాడు. ఇవనీసెవిచ్ తన మొదటి టూర్ సింగిల్స్ టైటిల్‌ను 1990లో స్టట్‌గార్ట్‌లో గెలుచుకున్నాడు. యుగోస్లేవియా, ప్రపంచ టీమ్ కప్‌ను గెలుచుకోవడంలో తోడ్పడ్డాడు. 1991లో క్రొయేషియా స్వాతంత్ర్యం పొందాక జట్టు నుండి నిష్క్రమించాడు. దానికి ముందు డేవిస్ కప్‌లో యుగోస్లేవియా తరపున ఎనిమిది మ్యాచ్‌లలో ఆడాడు [5] ఆ తరువాత, యుగోస్లేవియా ఫ్రాన్స్‌తో జరిగిన పోటీలను 5-0 తో కోల్పోయింది.
ఇవనీసెవిచ్ దాడి చేసే తన ఆటతీరుకు, అత్యంత శక్తివంతమైన సర్వీసుకూ ప్రసిద్ధి చెందాడు. ఎక్కువ ఏస్‌లను సర్వ్ చెయ్యడంలో చాలా సంవత్సరాల పాటు అతను అగ్రస్థానాన ఉండేవాడు. అప్పుడప్పుడు కోర్టులో కోపతాపాల ప్రదర్శించడానికి కూడా ప్రసిద్ధి చెందాడు. సాధారణంగా కోపాన్ని తనపైననే చూపించుకునేవాడు. ఆటలో అస్థిరతకు అతను ప్రసిద్ధి. 1992 ఆస్ట్రేలియన్ పురుషుల హార్డ్కోర్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇవనీసెవిచ్ను చంపుతామనే బెదిరింపులు వచ్చాయి. [6] అతను ఆ టోర్నీలో విజయం సాధించాడు.
1992లో, ఇవనీసెవిచ్ తన మొదటి వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇవాన్ లెండిల్, స్టెఫాన్ ఎడ్బర్గ్, పీట్ సంప్రాస్లను వరుసగా ఓడించాడు.[7][8] ఇవనీసెవిచ్ 6–7, 7–6, 6–4, 6–2 తో సంప్రాస్‌పై సెమీఫైనల్లో సాధించిన విజయం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఇవనీసెవిచ్ 36 ఏస్‌లు సాధించాడు. మొత్తం మ్యాచ్‌లో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా ఎదుర్కోలేదు.[9] ఫైనల్లో, ఇవనీసెవిచ్ ఆండ్రీ అగస్సీని ఎదుర్కొన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకునే ప్రయత్నంలో ముఖాముఖీ తలపడ్డారు. అగస్సీ చివరికి 6–7, 6–4, 6–4, 1–6, 6–4తో గెలిచాడు. [10] ఐదవ సెట్లో, ఇవనీసెవిచ్ 3-3 వద్ద అగస్సీ సర్వీస్‌ను బ్రేక్ చేసే స్థితిలో ఉన్నాడు, కానీ దానిని మార్చడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ చివరి గేమ్‌లో, ఇవనీసెవిచ్ గేమ్‌ను ప్రారంభించేందుకు 2 డబుల్ ఫాల్ట్‌లను చేసాడు.[11] అంతకు ముందు మొత్తం మ్యాచ్‌లో కేవలం 5 డబుల్ ఫాల్ట్‌లను మాత్రమే చేసాడు. టోర్నమెంట్లో ఇవనీసెవిచ్ ఏస్ కౌంట్ (206) ఆ సమయానికి వింబుల్డన్ చరిత్ర లోనే అత్యధికం. 2001 లో మళ్ళీ ఇవనీసెవిచ్ 213 ఏస్‌లతో తన సొంత రికార్డును తానే అధిగమించాడు. [12] ఇవనీసెవిచ్ 1992 వింబుల్డన్ ఫైనల్లో అగస్సీపై 37 ఏస్‌లు సాధించగా, అగస్సీ మొత్తం టోర్నమెంట్లో 37 ఏస్‌లు సాధించాడు. ఆ వేసవి తర్వాత బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో, ఇవనీసెవిచ్ అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం సాధించిన క్రొయేషియాకు ప్రాతినిధ్యం వహిస్తూ సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.[13][14] అతను ప్రారంభ వేడుకలో క్రొయేషియా జట్టుకు జెండా పట్టుకుని నడిచాడు. తన సింగిల్ కాంస్య పతకాన్ని సంపాదించడానికి, అతను వరుసగా నాలుగు 5-సెట్ల మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. [13] ఆ ఏడాది నాలుగు సింగిల్స్ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు.
ఇవనీసెవిచ్ 1994 లో రెండవసారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్నాడు, అక్కడ అతను డిఫెండింగ్-ఛాంపియన్ పీట్ సంప్రాస్ చేతిలో 7–6, 7–6, 6–0తో ఓడిపోయాడు. [15] ఇవనీసెవిచ్ ఆ సంవత్సరం జూలైలో తన కెరీర్లో అత్య్యుత్తమ సింగిల్స్ ర్యాంకింగ్ ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు.
1995లో, ఇవనీసెవిచ్ 7–6, 6–3, 6–4తో ఫైనల్లో టాడ్ మార్టిన్‌ను ఓడించి గ్రాండ్ స్లామ్ కప్‌ను గెలుచుకున్నాడు. [16] వింబుల్డన్‌లో, ఇవనీసెవిచ్ మళ్లీ సెమీఫైనల్స్‌లో సంప్రాస్‌తో 6–7, 6–4, 3–6, 6–4, 3–6తో ఓడిపోయాడు.
2001 వేసవి నాటికి, ఇవనీసెవిచ్ ప్రపంచ 125 వ ర్యాంకు సాధించాడు. వింబుల్డన్ మెయిన్ డ్రాలో ఆటోమాటిగ్గా చోటు సంపాదించడానికి అది సరిపోలేదు. కానీ, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన అతని గత రికార్డు కారణంగా, సింగిల్స్ డ్రాలో ప్రవేశించేందుకు అతనికి వైల్డ్ కార్డ్ లభించింది. అతను మాజీ ప్రపంచ నం. 1 ఆటగాడు కార్లోస్ మోయాను, భవిష్యత్ ప్రపంచ నం. 1 ఆటగాడు ఆండీ రాడిక్ మరాత్ సఫిన్లతో పాటు ఫ్రెడ్రిక్ జాన్సన్, గ్రెగ్ రుసెడ్స్కీలను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. వర్షం కారణంగా మూడు రోజుల పాటు ఆడిన ఐదు సెట్ల సెమీఫైనల్లో ఫేవరెట్ టిమ్ హెన్మాన్ను ఓడించాడు. దాన్ని క్లాసిక్ ఆటగా పరిగణిస్తారు.[17][18][19] ఆ విజయంతో అతను మునుపటి సంవత్సరం రన్నరప్, మాజీ US ఓపెన్ ఛాంపియన్ పాట్రిక్ రాఫ్టర్తో తలపడ్డాడు. 1998 తర్వాత ఇవనీసెవిచ్కి ఇది మొదటి సింగిల్స్ ఫైనల్. మూడు గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఇవనీసెవిచ్ 6–3, 3–6, 6–3, 2–6, 9–7తో రాఫ్టర్‌ను ఓడించాడు. దాంతో ఇవనీసెవిచ్, వింబుల్డన్ గెలిచిన మొదటి వైల్డ్ కార్డ్ ఆటగాడిగా, అత్యల్ప ర్యాంక్‌లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. [20] ఇప్పటి వరకు, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను వైల్డ్ కార్డ్‌గా గెలుచుకున్న ఏకైక పురుషుడు అతనే. బ్రిటీష్ టెలివిజన్ ప్రోగ్రామ్ వారి 100 గ్రేటెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్స్ జాబితాలో అతని వింబుల్డన్ విజయం పదహారవ స్థానంలో ఉంది.
ఇవనీసెవిచ్ సర్వ్ అండ్ వాలీ ఆటగాడు. గ్రాస్ కోర్ట్లకు సరిపోయే వేగవంతమైన, దూకుడు ఆట ఆడతాడు. ఎడమ చేతితో చేసే శక్తివంతమైన, ఖచ్చితమైన సర్వీసుకు, ముఖ్యంగా ఆట కోల్పోయే దశలో ఉన్నపుడు అతడు చేసే సర్వ్‌కు గాను అతను ప్రసిద్ధి చెందాడు. టెన్నిస్ చరిత్రలో అత్యంత ఆధిపత్య సర్వర్లలో అతను ఒకడిగా పరిగణిస్తారు. ప్రత్యర్థి ఒక్కసారి కూడా అతని సర్వ్‌ను తిరిగి కొట్టకుండానే మొత్తం గేమ్‌లను గెలుచుకునేవాడు.
చాలా మంది సర్వ్-అండ్-వాలీయర్ల మాదిరిగానే, ఇవనీసెవిచ్ రిటర్న్ గేమ్, డిఫెన్సులు బలహీనంగా ఉంటాయి. బ్యాక్హ్యాండ్లో టాప్-స్పిన్‌తో కొట్టడానికి బదులు, తరచూ స్లైస్‌ను ఉపయోగిస్తాడు.
1998లో ఇవనీసెవిచ్, కాస్మోపాలిటన్ మ్యాగజైన్ 1996 సెప్టెంబరు ఎడిషన్ కవర్‌పై సెర్బియా-క్రొయేషియా మోడల్ టట్జానా డ్రాగోవిక్ను చూసి ఆమెతో డేటింగ్ చేసాడు. [21][22] 2009లో డ్రాగోవిక్ను పెళ్ళి చేసుకున్నాడు. వారికి అంబరు మారియా, ఇమాన్యుయేల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అ తరువాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు.[23][24] అతని రెండవ భార్య నివ్స్ కానోవిచ్.